* గ్యారంటీల పేరుతో 4 కోట్ల మందికి టోపీ వేశారు – కేటీఆర్ ధ్వజమెత్తు
హైదరాబాద్, ఆకేరు న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలను వంచిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 840 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘అభయహస్తం’ మేనిఫెస్టో ఒక అతిపెద్ద మోసమని ఆయన అభివర్ణించారు. 2029లో తాము సత్తా ఏంటో చూపిస్తామని, అప్పటి వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తన హామీల నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందుకోసం తాము ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా ప్రజలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వెంటనే సభలో ఆమోదించాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారని, వారం తర్వాత గవర్నర్తో అసెంబ్లీలో చెప్పించారని, కానీ నేటికీ ఆ హామీలకు మోక్షం కలగలేదని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర అభివృద్ధిపై కూడా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ఐటీ వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోందని, ప్రభుత్వ డేటానే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. బడ్జెట్లో ఆకర్షణీయమైన అంకెలు చూపిస్తూ ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500, రైతు భరోసా కింద రూ. 15,000 వంటి ప్రధాన హామీలు అమలు కాకపోవడంపై ఆయన నిలదీశారు. అసంపూర్తిగా ఉన్న రైతు రుణమాఫీ, మూసీ ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న భారీ కుంభకోణం, పేదల ఇళ్ల కూల్చివేత వంటి అంశాలపై ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన కేవలం గ్యారంటీల గారడీగా మారిందని, అసెంబ్లీ లోపల మరియు వెలుపల ప్రభుత్వాన్ని ఎండగడతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
