* అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ ….
* మహిళా సాధికారతకు ఆర్థిక స్వాలంబనే పునాది..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన మహిళా పురస్కారాల ప్రదానోత్సవంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేదిక సాక్షిగా మహిళా లోకానికి ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ముందుగా వారు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, అప్పుడే సమాజంలో నిజమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో మహిళల పోరాటం సామాన్యం కాదు..
ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వంటి ప్రముఖులతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచం ఇంకా పురుషాధిక్యతతోనే నడుస్తోందని, రాజకీయ క్షేత్రం కూడా దానికి మినహాయింపు కాదని అభిప్రాయపడ్డారు. ఒక పురుషుడు విజయం సాధించడానికి 100 శాతం కృషి చేస్తే, అదే రంగంలో మహిళ రాణించాలంటే 200 శాతం కష్టపడాల్సిన పరిస్థితులు నేటికీ ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని నిలబడటం సామాన్యమైన విషయం కాదని మహిళా ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఆర్థిక స్వతంత్రం ఉంటేనే ఆత్మగౌరవం:
యువతులకు, పెళ్లి కాబోయే అమ్మాయిలకు కేటీఆర్ ఒక ముఖ్యమైన సూచన చేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో తొందరపడి వివాహాలు చేసుకోవద్దని, ముందుగా ఒక ఉద్యోగమో లేదా ఒక పరిశ్రమనో స్థాపించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. “ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ అయితేనే సమాజంలో స్వాతంత్రం, గౌరవం లభిస్తాయి. వేరే వారి మీద ఆధారపడితే వచ్చే ఇబ్బందుల గురించి మీ అమ్మలను లేదా ఇంట్లోని పెద్దవాళ్లను అడిగితే తెలుస్తుంది. అందుకే ఆర్థిక స్వాలంబన సాధించిన తర్వాతే జీవితంలో తదుపరి అడుగు వేయండి” అని ఆయన హితవు పలికారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి-హబ్:
తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ‘వి-హబ్’ (V-Hub) వంటి వినూత్న సంస్థలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. కాలేజీ విద్యార్థినులు సైతం పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను మరింత బలోపేతం చేస్తామని, మహిళల సంక్షేమం కోసం మరిన్ని రెట్టింపు కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి:
స్థానిక సంస్థల్లో గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, త్వరలోనే చట్టసభల్లో కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి సుశిక్షితులైన, సమాజం పట్ల అవగాహన ఉన్న, చదువుకున్న మహిళలు పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల కంటే ఎక్కువగా మహిళలకు తమ పార్టీ ప్రాతినిధ్యం కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహిళా శిరోమణులకు పురస్కారాలు:
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 మంది మహిళలను గుర్తించి వారికి పురస్కారాలు అందించడం శుభపరిణామన్నారు. అవార్డు గ్రహీతల్లో డాక్టర్లు, సోషల్ వర్కర్లు, ఆర్టిస్టులు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు మరియు ప్రజాప్రతినిధులు ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమాజ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి మహిళకు ఆయన హృదయపూర్వక వందనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింధు, సాయిబాబా, రంగన్న, మమత, రోజా, ఆదర్శ్, రవి యాదవ్, నరేందర్, పాండురంగారెడ్డి, అంజన్న తదితరులు పాల్గొన్నారు. చివరగా ‘జై తెలంగాణ – జై కేసీఆర్’ నినాదంతో కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
