* డీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా గుర్తింపు
* కర్నూలులోనే కొందరి అంత్యక్రియలు
ఆకేరు న్యూస్, కర్నూలు : కర్నూలు బస్సు ప్రమాదం ఎంతటి విషాదం నింపిందో ఎవ్వరూ మరచిపోరు. అక్కడి భీతావహ దృశ్యాలు ఇప్పటికీ సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలు, బుగ్గి అయిన శరీరాలు బాధిత కుటుంబాలను తల్లడిల్లేలా చేస్తున్నాయి. ఆ భయానక పరిస్థితులను తలుచుకుని కుమిలిపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన తమ వారి శరీరాలను చూసి వారి ఆవేదన తీరనిది. ఈనెల 24న జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో 19 మంది సజీవదహనం అయ్యారు. డీఎన్ఏ రిపోర్టు (Dna Reports) ఆధారంగా మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించడం పూర్తయినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ (Sp Vikranth Patil) తెలిపారు. వి.కావేరి ట్రావెల్స్ బస్సుప్రమాదంపై మరో కేసు నమోదు చేశామన్నారు. శివశంకర్ మద్యం తాగినట్లు నిర్ధారించామన్నారు. బస్సు డ్రైవర్ మద్యం తాగినట్లు తేలలేదన్నారు. ఈరోజు ఉదయం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ (29) మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వివరించారు. కర్నూలు ఎమ్మార్వో ఆంజనేయులు, పోలీసుల సమక్షంలో కర్నూలు శ్మశాన వాటికలో ప్రశాంత్ మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నిన్నటి వరకు 18 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఈరోజు 19వ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో తమిళనాడుకు చెందిన ప్రశాంత అంత్యక్రియలు కూడా కుటుంబసభ్యుల వినతితో కర్నూలు(Kurnool)లోనే పూర్తి అయ్యాయి.
……………………………………………..
