*మొదలైన బ్రహ్మోత్సవాలు
ఆకేరున్యూస్, మహబూబ్నగర్ : మహబూబ్నగర్(mahaboobnagar) జిల్లాలో ప్రముఖపుణ్యక్షేత్రమైన కురుమార్తి వేంకటేశ్వరస్వామి(kurumurthy venkateswarswamy) బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని పేదల తిరుపతిగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. జాతరకు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు కూడా ఊళ్లకు వస్తుంటారు. ఈనేపథ్యంలో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దాదాపు 30 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజు యాగాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆలయంలో ఆవాహిత దేవతా పూజలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి కల్యాణోత్సవం నవంబర్ 2న, అలంకారోత్సవం 6న, ఉద్దాలోత్సవం 8న జరుగుతాయి. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వరస్వామి కురుమూర్తి రాయుడిగా ప్రజలు కొలుస్తుంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపే ప్రధాన ఘట్టం కాగా.. పల్లమర్రి(Pallamarrri) నుంచి చాటను ఊరేగింపుగా వడ్డేమాన్ వరకు తీసుకువస్తారు. అక్కడే నియమ నిష్టలతో తయారు చేసిన స్వామివారి పాదుకల (ఉద్దాల) ఊరేగింపు భారీ బందోబస్తు మధ్య ఆలయం వరకు కొనసాగడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ(telangana) నుంచి భక్తులు తరలివస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది.
……………………………………….