
* మొలుగుమాడు గ్రామంలో ప్రారంభించిన మంత్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మొలుగుమాడు గ్రామంలో భూ భారతి చట్టం సర్వేను మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తప్పుల తడకగా మారి రైతుల ఉసురు తీసిన ధరణి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సర్వే కోసం 3,550 మంది అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గతంలో ధరణి పేరుతో రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. లేని భూములకు రైతుబంధు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈరోజు నుంచి ప్రజల దగ్గరకే రెవెన్యూ అధికారులు వెళ్లి, భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు తీసుకుంటారు. మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందున్న ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే 4 మండలాల్లో భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. ఇక ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళ్తుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు.
………………………………………….