
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు పార్టీ నాయకులు, సీపీఎం నాయకులు గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో నివాళులర్పించారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్నిఅభిమానుల సందర్శనార్ధం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. అనంతరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగిస్తారు.
పలువురి సంతాపం..
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సుధాకర్‌రెడ్డి మరణం ఎంతో బాధాకరమని , దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు తెలిపారు. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే అందరితో కలిసి పనిచేసిన అజాతశత్రువు సుధాకర్ రెడ్డి అని అన్నారు. బీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విశేషంగా పనిచేశారని స్మరించుకున్నారు.
………………………………………………………….