*జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సర్దార్ సింగ్
* ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు
ఆకేరు న్యూస్, ములుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ములుగు జిల్లా సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యం. సర్దార్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా తన ఆస్తుల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేయడం గొప్ప త్యాగానికి నిదర్శనమని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో ఆయన భాగస్వామిగా ఉండటం యువతకు ప్రేరణ కలిగించే విషయం అని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలను కొత్త తరానికి చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. మొదట కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిప్ప అశోక్, మాజీ అధ్యక్షులు డి.పి. జనార్దన్, చేనేత సంఘం జిల్లా నాయకులు కందగట్ల సారయ్య, శ్రీ మర్కెండయ పరపతి సంఘం అధ్యక్షులు బాసని రాంమూర్తి, జిల్లా పద్మశాలి సంఘం సెక్రటరీ కె. వేణుగోపాల్, పద్మశాలి సంఘానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సీనియర్ సిటిజెన్ చిందం రాజమల్లు, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………
