
* తెలంగాణలోనే రెండో అతిపెద్ద పండుగ
* అంగరంగ వైభవంగా ప్రారంభం
* లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
డిల్లెం బల్లెం చప్పుళ్లు.. డోలు వాయిద్యాలు.. శివసత్తుల నృత్యాలు.. కాళ్లకు గజ్జెల చప్పుళ్లతో.. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి (Durajpalli) మారుమోగ్రుతోంది. లింగ నామస్మరణతో పెద్దగట్టు హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి జాతర (Peddagattu Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈజాతరకు రెండు తెలుగు రాష్ట్రాలలో నుంచే కాకుండా, పొరుగున వున్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్ళ కొక సారి అత్యంత వైభవంగా సాగే జాతర విశేషాలు ఆకేరు న్యూస్‌లో..
200 ఏళ్ల చరిత్ర
పెద్దగట్టు జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామానికి దురాజ్‌పల్లిగా పేరొచ్చిందని భక్తుల విశ్వాసం. దురజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట. పెద్దగట్టుపై ఉన్న లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఓ లింగా… ఓ లింగా .. అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి వస్త్రాలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు.
ఐదు రోజుల పండుగ
లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం (శాకాహారం) సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతా యి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు. జాతర జరిగే తొలిరోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు… మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభోగంగా జరుగుతుంది.
ఇలా ప్రారంభమైంది..
హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారి (65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో పెద్దగట్టుఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సాగే జాతరలో కీలకమైన దేవరపెట్టె (అందెనపు చౌడమ్మ, లింగమంతుల స్వామి ఉత్సవ మూర్తులు)కు ఆనవాయితీ ప్రకారం కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరపెట్టెను ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేసారంలోని మెంతబోయిన వంశస్తులకు చెందిన దేవరగుడిలో దేవరపెట్టెకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మున్నా, గొర్ల, కులస్తులతోపాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అదేవిధంగా జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
………………………………………………………..