* ఐదునిమిషాల వ్యవధిలో…
*మహబూబాబాద్ జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మొన్న బుధవారం రోజు పిడుగులు పడ్డ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది మృతి చెందిన విషయం తెల్సిందే..కాగా గురువారం మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. జిల్లా లోని మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఒకే ఇంటిపై ఐదు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు పిడుగు పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగరి వెంకన్న, వెంకటమ్మ దంపతులు నివాసముంటున్నారు. గురువారం రాత్రి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో వెంకన్న ఇంటి మెట్లపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న దంపతులు ఉలిక్కి పడ్డారు.ఏం జరుగుతుందో చూసే లోపే ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి స్లాబ్పై మరో పిడుగు పడింది. దీంతో గృహోపకరణాలు కాలిపోగా స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనతో యజమానురాలు వెంకటమ్మసొమ్మసిల్లి పడిపోగా ఆస్పత్రికి తరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని గ్రామ పరిపాలన అధికారి గణేష్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. కాగా, పిడుగుపాటుకు పేదవాడైన వెంకన్నకు ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేశ్ కోరారు.
………………………………………
