
– ఇలా చేస్తే మళ్లీ మీ వద్దకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి :
ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి అవసరంగా మారింది. ఆఫీసుకు వెళ్లిన వారు పొరపాటున ఫోన్ ఇంట్లో మరచిపోయారంటే.. ధ్యాస దానిపైనే ఉంటుంది. హైదరాబాద్‌లో ఉంటున్న వారైతే ర్యాపిడో, ఓలా తదితర సర్వీసు రైడ్ సంస్థల నుంచి బైకు రైడర్ల ద్వారా ఫోన్లు తెప్పించుకుంటున్నారు. కొంతసేపు కూడా ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి ఫోను పొరపాటున పోతే. ఫోను పోతే ఒకప్పుడు దానిమీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సరికొత్త టెక్నాలజీతో ఇట్టే కనిపిపెట్టేస్తున్నారు పోలీసులు. అది ఎలా.. అందుకు మనం ఏం చేయాలో ప్రత్యేక కథనం..
చోరీ అయినా, పడిపోయినా..
ఫోన్ చోరీకి గురైనా, ఎక్కడైనా పడిపోయినా వాటిని వెదికిపెట్టేందుకు పౌరులకు పోలీసుశాఖ సహకరిస్తోంది. జాతీయ స్థాయిలో కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఇక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సహకారంలో అత్యంత వేగంగా స్మార్ట్ఫోన్లను కనిపెడుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషన్‌రేట్ పరిధిలో 6 నెలల వ్యవధిలోనే 5 విడతల్లో మొత్తం 4,030 స్మార్ట్ఫోన్లను వెదికిపట్టుకొని వాటిని బాధితులకు అందజేశారు. 45 రోజుల్లోనే 1190 స్మార్ట్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ సహకారంతోనే అత్యంత వేగంగా చోరికి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకొని వెంటనే బాధితులకు అప్పగిస్తున్నారు.
సీఈఐఆర్ పోర్టల్‌లో ఇలా నమోదు చేయాలి
స్మార్ట్ఫోన్లలో విలువైన సమాచారంతో పాటు మధురమైన జ్ఞాపకాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దొంగిలించబడిన స్మార్ట్ఫోన్లను రివకరీ చేసేందుకు పోలీసులు హైదరాబాద్ నగరంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనే ఎన్నో వ్యయ ప్రయాసలు పడి వాటిని నేరస్తుల నుంచి స్వాధీనం చేస్జ్జుకొని బాధితులకు అందజేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొబైల్ పోయిన వెంటనే (https://www.ceir.gov.in) పోర్టల్‌లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. ఫోన్లకు ప్రత్యేకంగా ఉండే ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను ఉపయోగించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చోరీకి గురైన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించకుండా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఫోన్‌ను చోరి చేసిన వారు దాన్ని ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. సీఈఐఆర్ సేవలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పోయిన వెంటనే అందులో నమోదు చేస్తే మీ ఫోన్లో ఉండే సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చు. దాంట్లో వేరే సిమ్ కార్డు వేసి వినియోగిస్తే వెంటనే పోలీసు శాఖ సమాచారం వస్తుంది. పోలీసులు త్వరగా వాటిని స్వాధీనం చేసుకునేదుకు వీలు కలుగుతుంది.
………………………………………..