* బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు
ఆకేరు డెస్క్, వరంగల్ : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. బుకింగ్ చేసుకున్నప్పటికీ వారం పదిరోజులు గడిచినా సిలిండర్ డెలివరీ కావడం లేదు. దీంతో చాలామంది పనులు మానుకుని ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ బుకింగ్ కూడా కావడంలేదు. పరిస్థితులు కరోనా కాలం నాటి కష్టాల కంటే దారుణంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టళ్లు, ఆసుపత్రులు, సత్రాల్లో..
గ్యాస్ కొరత ప్రభావం సామూహిక భోజన సౌకర్యాలు కల్పించే చోట్ల తీవ్రంగా ఉంది. ముఖ్యంగా వరంగల్ మహానగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని హాస్టళ్లలో గ్యాస్ లేక విద్యార్థులకు సకాలంలో టిఫిన్, భోజనం అందడం లేదు. కొన్ని హాస్టళ్లు కేవలం పప్పు అన్నంతోనే సర్దుబాటు చేస్తున్నాయి. రోగులకు భోజనం అందించే ఆసుపత్రులు, ఆనాథల కోసం నిర్వహించే ఆశ్రమాలలో గ్యాస్ సిలిండర్లు దొరక్క వంట నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కొందరు కట్టెల పొయ్యిలపై వండిపెడుతున్నారు.
సిలిండర్ల బ్లాక్ మార్కెట్..
గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధర మొన్నటి వరకురూ.924 ఉండగా ప్రభుత్వం రూ.60 పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹2,001.50 ఉండగా రూ.2145.50కి పెరిగింది. బ్లాక్ మార్కెట్లో గృహ వినియోగ సిలిండర్ రూ.1500 నుంచి రూ.2000, కమర్షియల్ సిలిండర్ రూ.3,000 నుంచి రూ.5000 వరకు పలుకుతోంది. పేదలు, వలస కూలీలు వాడే 5 కిలోల చిన్న సిలిండర్ గ్యాస్ ధరలు కూడా భారంగా మారాయి. 130 రూపాయలకు కిలో ఉండే ఈ గ్యాస్ రూ.200 వరకు పెంచారు. గ్యాస్ ధరలు భరించలేక, సిలిండర్లు దొరక్క చాలామంది మళ్ళీ కట్టెలపొయ్యి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే డిమాండ్ పెరగడంతో కట్టెల ధరలు కూడా రెట్టింపయ్యాయి.
