*ఆస్తి కోసం అత్తను హతమార్చిన అల్లుడు!
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని గార్ల మండలం మంగళితండాలో ఆస్తి వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. ఆస్తి దక్కదనే కక్షతో రాజేష్ అనే వ్యక్తి తన అత్తను కరెంట్ షాక్ ఇచ్చి కిరాతకంగా చంపాడు. నిందితుడు రాజేష్ అన్న రమేష్‌కు రెండో వివాహం జరగడంతో, ఆస్తిలో తనకు వాటా దక్కదని రాజేష్ ఆందోళన చెందాడు. ఈ పెళ్లి జరిపించిన అత్తామామలపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న రాజేష్, అత్తమామలపై దాడికి తెగబడ్డాడు.అత్త కౌసల్య (48), మామ రాందాసులకు కరెంట్ షాక్ ఇచ్చాడు. ఈ ఘటనలో కౌసల్య అక్కడికక్కడే మృతి చెందగా, మామ రాందాసు ప్రాణాలతో తప్పించుకున్నాడు. అడ్డువచ్చిన అన్న భార్యపై రాజేష్ కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ తిరుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
