Dhule 16 Dogs Poisoning Case
* మహారాష్ట్రలోని ధూలే నగరంలో ఘటన
* అజ్ఞాత వ్యక్తులపై కేసు.. సీసీటీవీ దృశ్యాల పరిశీలన
ఆకేరు న్యూస్, డెస్క్: మహారాష్ట్రలోని ధూలే నగరం వాడీభోకర్ రోడ్డు ప్రాంతంలో 16 కుక్కలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆహారంలో విషం కలిపి వాటిని చంపినట్లు వచ్చిన ఫిర్యాదుపై పశ్చిమ దేవ్పూర్ పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సుశాంత్ కాలనీకి చెందిన రుషికా ఉత్తమ్ పాటిల్ పెంపుడు కుక్క ‘ఝింగా’ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. నోటి నుంచి లాలాజలం కారుతూ విలవిల్లాడటంతో ఆమె పశువైద్యులను సంప్రదించారు. చికిత్స అందించినప్పటికీ కుక్క ప్రాణాలు దక్కలేదు. అదే సమయంలో పరిసరాల్లో మరో నాలుగు కుక్కలు కూడా చనిపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రానికి మృతిచెందిన కుక్కల సంఖ్య 11కు చేరింది. అనంతరం పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా మొత్తం 16 కుక్కలు చనిపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. విషప్రయోగం వల్లే కుక్కలు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని స్థానికులు తెలిపారు.
రుషికా పాటిల్ ఫిర్యాదుతో పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

