
ఆకేరున్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగగా.. సోమవారం మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్‌ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జామ్ అయిన యాష్‌ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
……………………………………