
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ఈ నెల 29న జిల్లాలో నిర్వహించే వాటర్ షెడ్ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో వాటర్ షెడ్ యాత్ర నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి వినియోగం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ నెల 22 న అదిలాబాద్‌లో మొదలైన యాత్ర 29న మన జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని రేగొండ, పలిమల, మల్హర్ మండలాల్లోని మండలానికి రెండు గ్రామాల చొప్పున ఈ యాత్రను నిర్వహించడం జరుగుతుందన్నారు. నీటి పరిరక్షణ, సాగునీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా వాటర్ షెడ్ యాత్ర చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి నిల్వలను మెరుగుపరచడం, భూగర్భజలాలను రీఛార్జ్ చేయడం, రైతులకు నీటి సదుపాయం అందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ వాటర్ షెడ్ యాత్రలో లైన్ డిపార్ట్ మెంటు అధికారులతో పాటు వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, పంచాయితి రాజ్, ఉద్యానవనశాఖ, భూగర్భ జల శాఖ, నీటి పారుదల శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు. ప్రజలలో నీటి వినియోగం గురించి అవగాహన కల్పించడం కోసం ప్రచార రథం కేటాయించిన గ్రామాలలో తిరగడం జరుగుతుందని తెలిపారు. వాటర్ షెడ్ యాత్ర నిర్వహించే గ్రామాలలో నీటి వినియోగంపై ఫోటో ఎగ్జిబిషన్, మహిళ సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని, మొక్కలు నాటడం, ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు.
………………………..