ఆకేరు న్యూస్, నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం ఉందనగా మక్తల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది.సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. చివరి రోజు ప్రచారంలో భాగంగా ఎంపీ డీకే అరుణతో కలిసి మహదేవప్ప ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయన, అర్ధరాత్రి సమయంలో తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.మహదేవప్ప మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు పార్టీ శ్రేణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని మొదటి నుంచి మహదేవప్పపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యర్థి వర్గాల నుంచి ఎదురైన బెదిరింపుల వల్లే ఆయన మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.”కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యర్థుల బెదిరింపుల వల్ల ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అనే విషయాన్ని విచారణలో తేలుస్తాం” అని పోలీసులు వెల్లడించారు.బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ జరగాల్సి ఉండగా, అభ్యర్థి మృతి చెందడంతో 6వ వార్డులో ఎన్నిక వాయిదా వేసిన ఎన్నికల సంఘం. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

