*నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే.. రాజకీయాంశాలపై మల్లారెడ్డి క్లారిటీ!
*ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ ఆఫర్.. ఎందుకు నో చెప్పానంటే? – మల్లారెడ్డి.
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడంలో తన వంతు సహకారం ఉందని పేర్కొన్నారు. గతంలో రెడ్డి సంఘం నిర్వహించిన ఒక కీలక సమావేశంలో, రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ రెడ్డి కంటే శక్తివంతమైన నాయకుడు మరొకరు లేరని తాను గట్టిగా వాదించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు.
అన్నదమ్ముల వంటి అనుబంధం
రాజకీయంగా విమర్శలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా తాము ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. “ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా.. నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అంటూ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
సినిమా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు
రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా మల్లారెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ తనను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో వెండితెరపై ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని తన కోరిక అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
