
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత
* మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం
ఆకేరు న్యూస్, డెస్క్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallojula Venugopal ) పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు. కొద్దిరోజుల కిందట తన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావుకు కిషన్‌జీ పేరుతో వేణుగోపాల్‌రావు ఒక లేఖ రాశారు. అందులో మావోయిస్టు పార్టీ విధానాలపై వేణుగోపాల్‌రావు కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నట్లుగా ఉంది. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ మావోయిస్టు పార్టీకి ఆయన రాసిన మరో లేఖ కలకలం రేపింది. దాని తర్వాత ఆయన మావోయిస్టు పార్టీని వీడారు. అనివార్య కారణాలతో పార్టీని వీడుతున్నానని.. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటించారు. ఈ క్రమంలోనే 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు. పార్టీని వీడుతున్నట్టు కొన్నాళ్ల కిందటే మల్లోజుల లీకు ఇచ్చారు. పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కామెంట్లు చేశారు.
ఎన్కౌంటర్లో అన్నను కోల్పోయి..
మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. అన్న మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్‌జీ)ను విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలక వ్యవహరించారు. 2011 నవంబరు 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మృతి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె గడ్చిరోలి రీజియన్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో కూడా ఉన్నారు.
పార్టీలో మల్లోజుల ప్రస్థానం ఇలా..
కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ పూర్వ పీపుల్స్‌వార్ గ్రూపులో భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పని చేశారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీలో చేరాక మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా ఉన్నారు. దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు ఉన్న గెరిల్లా జోన్‌ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత ఆయన సీపీఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మల్లోజులపై భారీ ఎత్తున రివార్డులు ప్రకటించారు. మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మరణం తరువాత వేణుగోపాల్ రావు పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ‘లాల్గర్’ ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు.
……………………………………