హన్మకొండలో ఘోరం…
ఆకేరు న్యూస్, కాజీపేట:
హన్మకొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రిని, కట్టుకున్న భార్యను ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.
స్థానిక 28వ బ్లాక్లో నివాసముంటున్న రాజశేఖర్, ఆయన కుమార్తె రాజశ్రీలు తమ ఇంట్లోనే మంటల్లో చిక్కుకొని విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రాజశేఖర్ ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఈ దారుణానికి ఒడిగట్టింది రాజశ్రీ భర్త ప్రవీణ్ అని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ప్రవీణ్, గత వారం రోజులుగా అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. తొలుత ఈ ప్రమాదం నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని, పొగ రావడంతో ఏమీ చేయలేకపోయానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.
నిందితుడు ప్రవీణ్ పక్కా పథకం ప్రకారం.. నిద్రపోతున్న మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై ఇనుప రాడ్డు లేదా సుత్తితో దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ దంపతులకు ఏడాదిన్నర బాబుతో పాటు ఆరు నెలల పాప ఉన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులను బంధువులు తమ వద్దకు తీసుకెళ్లారు.
మృతులిద్దరూ స్థానికంగా అందరితో కలివిడిగా ఉండేవారని, అటువంటి వారిపై ప్రవీణ్ ఇంతటి ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
