
* జనగామ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిక్షపతి
* సకాలంలో వైద్యం చేయించాలి
* వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది
ఆకేరు న్యూస్, జనగామ ః పాముకాటుకు గురైన వ్యక్తులను సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకొస్తే మెరుగైన వైద్య సేవలు అంది ప్రాణాపాయం నుంచి బయటపడతారని జనగామ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిక్షపతి అన్నారు. ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు బొరియలలో ఉండే సర్పాలు బయటకు వస్తాయని తెలిపారు. రైతులు, కూలీలు పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు విష సర్పాల కాటుకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. విష సర్పాలలో అతి భయంకరమైనవి రక్త పింజర, కట్లపాము, త్రాచుపాము.
రక్తపింజర డేంజర్
రక్త పింజర అనే పాముకు వాడుకలో ఉన్న పేరు కటుక రేకుల పాము. ఇది గుడ్లు పెట్టకుండా, పిల్లలకు జన్మనిస్తుంది, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మానవ ఆవాసాల దగ్గర కూడా ఈ పాము కనిపిస్తుంది. రక్త పింజరి పాము ముదురు గోధుమ రంగులో శరీరంపై మచ్చలు ఉంటాయి. తల త్రిభుజాకారంలో ఉండి దవడ వద్ద గంత వంటి నిర్మాణం ఉంటుంది. రక్త పింజర కాటుకు గురైన వ్యక్తి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. కుట్టిన ప్రదేశం నుంచి, ముక్కు, నోరు, కళ్లు, పాయువు ప్రాంతాల నుంచి రక్తం స్రవిస్తుంది. కిడ్నీలు ఫెయిల్ అయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స అవసరం, లేకపోతే ప్రాణాపాయం సంభవించవచ్చని డాక్టర్ బిక్షపతి తెలిపారు.
కట్లపాము ప్రమాదకరం
కట్లపాము చాలా ప్రమాదకరమైన విష సర్పం. వీటి కోరలు చిన్నవిగా ఉండడంతో కాటువేసినట్లు కూడా తెలియదని, కాటుపడిన ప్రాంతంలో వాపు, నొప్పి ఉంటుందని, కానీ రక్తం రావడం ఉండదని, శరీరంపై పాకినట్లు ఉంటుందని తెలిపారు. కాటువేసిన గంట కాలంలో విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వస్తాయని తెలిపారు. నాడీ వ్యవస్థపై ప్రభావంతో పక్షవాత లక్షణాలతో శ్వాసకోశాలు పనిచేయక మరణం సంభవిస్తుందని తెలిపారు. త్రాచుపామును నాగు పాముగా కూడా వ్యవహరిస్తారు పాముకు కళ్ల జోడు వంటి గుర్తులు ఉంటాయి. ఇవి పడగ విప్పి కాటు వేస్తాయి. వీటి విషం సైటోటాక్సిస్పై ప్రభావం చూపుతుంది. కండరాలు, కణాలు వాపుకు గురై చనిపోయే ప్రమాదం ఉంది. పాము విష ప్రభావాలకు గురైన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకొస్తే వైద్య సేవలు అంది ప్రాణాపాయ స్థతి నుంచి భయటపడవచ్చునని జనగామ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భిక్షపతి అన్నారు. పాము కాటుకు మంత్రాలు పనిచేయవని, పాము కాటువేసిన వెంటనే మంత్రగాళ్ల వద్దకు వెళ్లి ప్రాణాపాయాన్ని కొనితెచ్చు కోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రులలో విష సర్పాల కాటు సరైన వైద్యం అందుతుందని డాక్టర్ బిక్షపతి తెలిపారు. పాముకాటు వేసిన వెంటనే పామును చంపి తేవడం చేయవద్దన్నారు. పాము కాటువేసిన చోట నోటితోగానీ, కత్తితోగాని, పసుపు రాయడంగాని చేయవద్దన్నారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయని డాక్టర్ భిక్షపతి తెలిపారు.
…………………………………………..