ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్ : దేశాన్ని2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహితంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దిశగా ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) కీలక నాయకుడు, అగ్ర శ్రేణి మావోయిస్టు కమాండర్ పాపారావు తన సహచరులతో కలిసి జగదల్పూర్లో లొంగిపోవడానికి సిద్ధమయ్యారు.
పాపారావు అలియాస్ సునమ్ చంద్రయ్య, మంగు దాదా. ఈయనపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. తనతో పాటు మరో 14 నుండి 21 మంది కేడర్‌తో కలిసి ఆయన జగదల్పూర్లో పోలీసుల ముందు లొంగిపోనున్నారు. దండకారణ్య ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ బస్తర్ విభాగంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా పాపారావుకు పేరుంది. ఈయన లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు నెట్వర్క్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి.
పాపారావు భార్య ఉర్మిల 2025 నవంబర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ దిలీప్ బేడ్జా కూడా 2026 జనవరి లో మరణించడంతో ఆయన కేడర్ బలహీనపడింది.
భారీ లొంగుబాట్లు..
కేంద్రం విధించిన మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో బస్తర్ ప్రాంతంలో వరుసగా భారీ లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 11న జగదల్పూర్లో 108 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. వీరి నుంచి సుమారు రూ.3.61 కోట్ల నగదు, ఒక కేజీ బంగారం, భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్) తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఇదిలా ఉండగా 2025 అక్టోబర్‌లో చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా 210 మంది మావోయిస్టులు చత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస పథకం కింద జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ పరిణామాలు దక్షిణ, పశ్చిమ బస్తర్ ప్రాంతాలను మావోయిస్టు ప్రభావం నుండి పూర్తిగా విముక్తి చేసే దిశగా బలమైన అడుగులుగా భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
