* ఆర్టీసీ బస్సు ప్రయాణం, ప్రయాణికులకు సురక్షితం.
* మేడారంలో తాత్కాలిక ఆర్.టి.సి. బస్‌స్టాండ్ ప్రారంభం.
* రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆకేరు న్యూస్, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర కు నాలుగువేల ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 28 నుంచి 31 వరకు జరుగు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని మేడారంలో తాత్కాలిక బస్టాండ్ ను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కోరిక బలరాం నాయక్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజు ఆర్టీసీ చైర్మన్ నాగిరెడ్డిలతో కలిసి శనివారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
మహాజాతర–2026 ఏర్పాట్లలో భాగంగా మేడారంలో రవాణా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను తీసుకొని అమలు చేసిందన్నారు. మేడారం జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4,000 ఆర్.టి. సి. బస్సులను ప్రణాళికబద్ధంగా నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా వెంటనే పెంచే విధంగా శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏర్పాట్ల కోసం రవాణా శాఖ తరపున వందలాది మంది అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, జాతర ప్రయాణ సేవలను అధికారికంగా ప్రారంభించామన్నారు. జాతర ప్రయాణ సేవలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ కాలవ్యవధిలో ప్రయాణికులకు రవాణా సేవలతో పాటు భద్రత, ఆరోగ్య సహాయం వంటి అంశాల్లో కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు జాతర విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్ ఉంటుందని,ఎక్కువ నడకన వెళ్ళాల్సి ఉంటుందన్నారు.ఆర్టిసి బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం భద్రతాపరంగా మరింత నమ్మదగినదని అన్నారు. జాతర సమయంలో చిన్న పిల్లలు తప్పిపోయే ఘటనలను నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఈ విధానం ద్వారా తప్పిపోయిన పిల్లలను వేగంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు. మేడారంలో మాస్టర్ ప్లాన్ తో ఆర్టిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆర్టీసీ సేవలను భక్తులు వినియోగించుకొని తరించాలని కోరారు.
మొదట మంత్రి సీతక్క మాట్లాడుతూ, 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్.టి.సి. బస్‌స్టాండ్‌ను ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
ప్రతి ఏడాది జాతర సందర్భంగా అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని, ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ములుగు జిల్లాలో సంవత్సరాల తరబడి బస్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వెంటనే స్పందించి దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో శాశ్వత బస్‌డిపో ను మంజూరు చేసినందుకు మంత్రి కి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బస్ డిపో అంశంపై మంత్రి సీతక్క వివరిస్తూ, రూ.7 కోట్ల వ్యయంతో ఏటూరునాగారంలో బస్ డిపోను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలన్నీ సమగ్రంగా కవర్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఏటూరునాగారమే అనుకూల ప్రాంతమని సూచించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అలాగే మంగపేట, ములుగు తదితర మండలాల్లో మినీ బస్స్టేషన్లను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ, ఏటూరు నాగారం ప్రాంతంలో డిపో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడి నుంచి భద్రాచలం సహా ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండేవని, డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు, భక్తులకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.మేడారం ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొంటూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు ఈడి ఓ ముని శేఖర్, సోలోమన్ , వెంకన్న , శ్రీధర్, విజయభనువు, భానుకిరణ్, ఆర్టీసీ అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.

………………………………………………………………………
