* మేడారంలో రోడ్ల వెడల్పులో చెట్ల తొలగింపు
* మాస్టర్ ప్లాన్ తో గద్దెల నిర్మాణం
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని జాతర ఆవరణలో పరిసరాలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులు అమ్మవార్ల గజ్జలను సులభంగా దర్శించుకునేందుకు వీలుగా అధికారులు, పూజారుల సూచనల మేరకు ఆదివాసి ఆచార సంప్రదాయాలతో గోవిందారాజు ,పగిడిద్దరాజుల గద్దె ల నిర్మాణం కొనసాగుతోంది. జాతర సమయం సమీపిస్తుండడంతో అధికారులు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు .గద్దెల నిర్మాణ పనుల తోపాటు గోవిందరావుపేట మండలం పసర మీదుగా నార్లాపూర్ నుంచి మేడారానికి రోడ్డు మరమ్మత్తులు జంపన్న వాగు స్తూపం నుంచి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను ఆర్ అండ్ బి శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం అమ్మవార్ల గద్దెల నుంచి జంపన్న వాగు వరకు చల్లటి నీడనిచ్చే చెట్లను సంబంధిత శాఖ అధికారులు తొలగిస్తూ క్లియర్ చేస్తున్నారు .దీంతోపాటు అంతర్గత లింకు రోడ్లు ఊరటం నుండి కాల్వపల్లి వరకు మేడారం లో వనం రోడ్డు ఊరట్టం నుంచి కొండాయి రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు వివిధ శాఖల అధికారులు చేపట్టబోయే అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూన్నారు. ఏది ఏమైనప్పటికీ సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మరం చేస్తున్నారు.

……………………………………………
