* పెళ్లికుమారుడిగా పగిడిద్దరాజు పయనం!
ఆకేరు న్యూస్,ములుగు:మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అంకురార్పణ జరుగుతోంది. వనదేవతల కొలువు తీరే ఈ అపురూప ఘట్టంలో మొదటి ఘట్టం అత్యంత కీలకం. సమ్మక్క తల్లి భర్త, పగిడిద్దరాజు గద్దెనెక్కేందుకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.పూనుగొండ్ల నుంచి మేడారం వరకు.. ఆధ్యాత్మిక యాత్ర జరగనున్నది.మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. సమ్మక్క తల్లికి పగిడిద్దరాజు ‘మేనల్లుడు’ అని, అందుకే ఆమె మహబూబాబాద్ జిల్లా కోడలని భక్తులు నమ్ముతారు. పెనక వంశీయుల సంప్రదాయం ప్రకారం, ఈ నెల 27న స్వామివారిని పెళ్లికుమారుడిగా ముస్తాబు చేస్తారు. పసుపు, కుంకుమలు అద్ది, వెదురు ప్రతిమ రూపంలో పడిగెపై పగిడిద్దరాజును ఉంచి.. సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల అటవీ మార్గం గుండా కాలినడకన మేడారం తరలిస్తారు.ఈ యాత్రలో ఆదివాసీల సంప్రదాయం అడుగడుగునా కనిపిస్తుంది. డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తుల జయజయధ్వానాలతో అడవి దారి మార్మోగుతుంది. దారి పొడవునా కన్నెపల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు వంటి ప్రాంతాల్లో స్వామివారు బస చేస్తారు. ముఖ్యంగా పూనుగొండ్ల మహిళలు ‘వరుడిగా వెళ్లి.. మరువెళ్లికి రావయ్యా’ అంటూ సంగనాపుతారు.
జాతరకు పగిడిద్దరాజే కీలకం..
పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువుదీరిన తర్వాతే, మహాజాతర అధికారికంగా ప్రారంభమైనట్లు భావిస్తారు.పగిడిద్దరాజు రాకతోనే మేడారంలో జాతర జోరు మొదలవుతుంది. ఆయన గద్దెనెక్కిన అనంతరమే చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకువచ్చే ప్రధాన ఘట్టం జరుగుతుంది.”ఈ అపురూప వేడుకను కళ్లారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
…………………………………………………..
