* వనదేవతల చెంతకు భక్తజనం!
ఆకేరు న్యూస్,ములుగు:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తి పారవశ్యం నెలకొంది. ఆధునిక కాలంలో వాహనాలు ఎన్ని ఉన్నా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ, భక్తులు ఎడ్లబండ్లపై మేడారానికి పయనమవుతున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం గ్రామం నుంచి సుమారు 30 ఎడ్లబండ్లు, మరికొన్ని ట్రాక్టర్లలో భక్తులు సోమవారం రాత్రి మేడారానికి బయలుదేరారు. రాత్రిపూట అడవి మార్గంలో సాగే ఈ ప్రయాణం ఎంతో ఆధ్యాత్మికంగా, ఉత్సాహభరితంగా సాగింది. మంగళవారం నాటికి వీరందరూ వనదేవతల గద్దెల వద్దకు చేరుకోనున్నారు.ఎడ్లబండ్లపై వెళ్లడం మేడారం జాతరలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. దీన్ని భక్తులు తరతరాలుగా వస్తున్నఒక ఆనవాయితీగా పాటిస్తున్నారు. బండ్లను రంగురంగుల పరదాలతో అలంకరించి, అవసరమైన ఆహార పదార్థాలు, వంట సామాగ్రితో భక్తులు తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మేడారం సందడి మొదలైంది. గ్రామాలన్నీ వనదేవతల నామస్మరణతో మారుమోగుతున్నాయి.వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులతో అటవీ ప్రాంతం ఇప్పుడు జనారణ్యంగా మారుతోంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
………………………………………………………
