
* బరాబర్ కావాలి
* రిజర్వేషన్లపై గళమెతెత్తిన బీసీ నేతలు
* హనుమకొండలో రౌండ్ టేబుల్ సమావేశం
ఆకేరు న్యూస్ హనుమకొండ : మా సంఖ్యా బలం ఎంతో మా వాటా కూడా అంతే ఉండాలని బీసీ నేతలు గళమెత్తారు. ఆదివారం హనుమకొండలోని రాం నగర్ లో ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ నేత్రుత్వంలో బీసీ నేతల రౌండ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై వారు మాట్లాడారు. సమావేశంలో బీసీ సామాజిక సంస్థలు, కుల సంఘాలు, మేథావి వర్గం పలు కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాలు ఏ రకంగా కదిలాయో అదే తీరులో బీసీ రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం సామాజిక తెలంగాణ కోసం ఆవిర్భవించాలని సమావేశం ఏక కంఠంతో ప్రకటించింది… తెలంగాణ సాధన కోసం సమరం సాగించిన బలహీన వర్గాల ప్రజలు ప్రస్తుతం తమ కోసం తాము ఉద్యమం చేయాల్సిన చారిత్రక అవసరం ఉత్పన్నమైందని మేథావులు అభిప్రాయ పడ్డారు. 42% రిజర్వేషన్ సాధన కోసం, చట్ట సభల్లో ప్రాతినిథ్యం కోసం బీసీలు, ఎంబీసీలు రాజకీయ పార్టీలను, అగ్రవర్ణ సంస్థలను యాచించడం కాదని, ఉద్యమ పంథాతో శాసించే స్థాయికి చేరాలని కోరారు. బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న దోబుచులాటపై, మభ్యపెట్టే ధోరణిపై బీసీ ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు మండి పడ్డారు.
సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ…..
తెలంగాణ సమాజంలోని బీసీలు బలహీనులు కాదని, బాహుబలులనే సంగతిని పాలక పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని బాహుబలుల బలమేంటే తెలంగాణ సాధన ఉద్యమంలో బీసీల పాత్ర రుజువు చేసిందని, సాయుధ పోరాటంలోనూ నైజాంను తరిమిన గతం గమనంలో ఉందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ అనేది సమాజంలో సగం కంటే ఎక్కువగా ఉన్న బీసీల పౌరహక్కు అని, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీసీ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాధికార పోరాటంలో ‘సామాజిక తెలంగాణ’ తమ జన్మహక్కు అని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఆశ చూపి అధికార కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తున్నారన్నారు.,రెడ్డి జాగృతి సంస్థ తో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు చర్చించి పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేయాలని బీసీల తరుపున అల్టిమేటమ్ జారీ చేస్తున్నట్టు సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ….
కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, కాంగ్రెస్ కామారెడ్డి లో పెట్టిన బిసి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ప్రతి ఏడాది ప్రకటించాలని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో కూడా 42 శాతం బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. విద్య, వైద్య రంగాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలలో కూడా 42% బీసీలకు అవకాశాలు కల్పించాలని, మెడికల్ ఇంజనీరింగ్ సీట్లలో విద్యార్థులకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష బ్రుందాన్ని ఢిల్లీకి తీసుకపోవాలని డిమాండ్ చేశారు…
. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఓబిసి ఉపాధ్యక్షురాలు డా. విజయ లక్ష్మీ, ఓబీసీ కోశాధికారి రాజేష్ కుమార్, ఓబీసీ జాయింట్ సెక్రెటరీ వేణుమాధవ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బిసి మహసేన రాష్ట్ర కన్వీనర్ తడిశెట్టి క్రాంతి కుమార్, ముదిరాజ్ నాయకులు పులి రజనీకాంత్ , ప్రొఫెసర్ సిఎచ్ రాములు, కమల్ కుమార్, బెనర్జీ, అఖిలభారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య యాదవ్, కాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కయ్య,వైద్యం రాజగోపాల్, బిసి మహసేన కో- కన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి, అడ్వకేట్ సర్జు మోహన్, ఓబీసీ యూత్ నాయకులు మౌనిక గౌడ్,ఆరె క్షత్రియ నాయకులు మనోహర్ రావు, భిక్షపతి, శ్రీధర్ రాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..