* రోడ్డు భద్రత నియమాలు అందరూ పాటించాలి
* రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, ములుగు: రోడ్డు భద్రత సామాజిక బాధ్యతని రోడ్డు నియమాలను అందరూ పాటించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు-2026 పై వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ ఎం భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ములుగు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఓ ఎస్ డి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )సంపత్ రావు లతో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేవారని, గత ఏడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది 7,949 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై ఈ నెల ఆఖరులోగా జిల్లా స్థాయిలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించాలని, కార్యక్రమం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు.
నేషనల్ హై వే, ఆర్ అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రత మాసోత్సవాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని, నెల రోజులపాటు ట్రాఫిక్ వాలంటీర్లను నియమించాలని సూచించారు. అనంతరం వారిని అభినందిస్తూ సర్టిఫికెట్ అందించాలని సూచించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని, రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం ఇస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రవాణా శాఖా అధికారి శ్రీనివాస్, డిఈఓ సిద్ధార్థ రెడ్డి, నేషనల్ హై వే డిఈ కుమార స్వామి, పీఆర్ ఈఈ అజయ్ కుమార్, ఆర్అండ్ బీ ఈఈ శ్యామ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, తదితరులు పాల్గొన్నారు.

……………………………………………

