* వణుకుతున్న ప్రజలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో చలి.. పులి చంపేస్తోంది. ప్రజలను వణికిస్తోంది. ఔటర్ రింగు రోడ్డు పరిధి, శివారు ప్రాంతాలు, జిల్లాలో పొగమంచు కమ్మేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వెటర్లు, రగ్గులు కూడా చలిని ఆపలేకపోతున్నాయని వాపోతున్నారు. పొద్దున్నే లేచి పనులకు వెళ్లేవాళ్లు మరింత అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సహా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు పడిపోవటంతో ప్రజలు చలికి వణుకుతున్నారు.
7 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ లకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. హనుమకొండలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్ లలో కూడా 7 డిగ్రీలు నమోదయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో 8-10 డిగ్రీలుగా మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉత్తర తెలంగాణలోనే అధికం
ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి తీవ్రత ప్రభావం మరింత అధికంగా ఉంది. మరో మూడు రోజులపాటు అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో చలి తీవ్రత వేగంగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారుప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
……………………………………………………….
