*మంత్రి సీతక్క భావోద్వేగం
ఆకేరు న్యూస్, డెస్క్: “నా భర్త కుంజా రాము కేవలం నా జీవిత భాగస్వామి మాత్రమే కాదు, నా పోరాటానికి మార్గదర్శి. ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిది. అడవి బిడ్డల కష్టాలు చూసి ఆయన మౌనంగా ఉండలేకపోయారు, వారి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు,” అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లి గ్రామంలో ఆదివాసీ నేత, అమరవీరుడు కుంజా రాము 22వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన కుమారుడు సూర్య మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కుంజా రాము స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
పోరాటమే ఊపిరిగా..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. “జల్-జంగిల్-జమీన్” హక్కులు ఆదివాసీలకే చెందాలన్నది కుంజా రాము నిశ్చితాభిప్రాయమని, ‘మావా నాటే – మావా రాజ్’ (మా ఊరు – మా రాజ్యం) అనే నినాదమే ఆయన గుండె చప్పుడు అని పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని, అదే ఆశయంతో తాను ప్రజల మధ్య పనిచేస్తున్నానని మంత్రి తెలిపారు. ఆదివాసీ హక్కులను కాపాడుకోవడం, కుంజా రాము చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని ఆమె పిలుపునిచ్చారు.
‘అడవి దివిటీలు – సీతక్క కుంజా రామన్న’ పుస్తక ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో భాగంగా రచయిత అప్పాల శ్రీనివాస్ రచించిన “అడవి దివిటీలు – సీతక్క కుంజా రామన్న” అనే పుస్తకాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కుంజా రాము చేసిన పోరాట గాథను, ఆయన సిద్ధాంతాలను భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం చేరువ చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్ధంతి సభలో అరుణోదయ విమలక్క, స్థానిక ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుంజా రాము చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
