ఆకేరు న్యూస్, ములుగు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘం సమావేశ భవనం పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 10 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి సీతక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిందని మహిళా సంఘాల వారికి వడ్డీలేని రుణాలు ఇస్తుందని మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రజా ప్రభుత్వం సహకరిస్తుందని మహిళా సంఘాల్లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుందని వివరించారు.
ఇటీవలే జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల వారికి స్టాల్స్ ఏర్పాటు చేయగా వారి పెట్టుబడి పొగ రెండింతల ఆదాయం వచ్చిందని దినితో వారు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మహిళలు తాము సొంతంగా ఎదగడానికి రుణాలు మంజూరు చేసి మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క మహిళ మహిళా సంఘాల్లో చేరాలని 60 సంవత్సరాలు దాటిన వారు సైతం మహిళా సంఘంలో చేరవచ్చని మంత్రి సీతక్క సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సంపత్ రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పస్రా సర్పంచ్ సుమలత అధికారులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
