* కేబినెట్ మీటింగ్ చరిత్రలో మైలురాయి
* సీఎం…మంత్రుల కుటుంబాలు బస చేశాం
* సీఎం పర్యటన విజయవంతం చేయడం అభినందనీయం
* మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఆకేరున్యూస్, మేడారం : వనదేవతల కీర్తిని ప్రపంచస్థాయిలో చాటేలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం మేడారంలో హరిత హోటల్?లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని, బుధవారం మండే మెలిగే పండుగతో మరోఘట్టం మొదలవుతుందని, మండే మెలిగే పండుగ నుంచి నిండు పండగ వరకు ఇదే రకంగా విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం చరిత్రలో ఒక మైలురాయిలా నిలుస్తుందని, హైదరాబాదులో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశామన్నారు. కేవలం క్యాబినెట్ సమావేశమే కాదని ఆదివారం రాత్రి సీఎం కుటుంబం, మంత్రుల కుటుంబాలు సామాన్య భక్తుల తరహాలోనే ఇక్కడ బసచేశాయన్నారు. రెండు రోజులపాటు ఇక్కడ యావత్ క్యాబినెట్ ఉండడం, క్యాబినెట్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రకటించడం ములుగుకు గర్వకారణమన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, హోంగార్డుల నుండి డీజెపి వరకు.. కష్టపడి పనిచేసి క్యాబినెట్ సమావేశాన్ని, సీఎం పర్యటనను విజయవంతం చేశారని ఆమె అభినందనలు తెలిపారు. సమ్మక్క సారలమ్మ కీర్తి స్ఫూర్తి నీ నింపుకొని మహిళలు ఎన్నో విజయాలు సాధించేందుకు సీఎంతో పాటుగా పెద్ద ఎత్తున మహిళలకు దర్శనాలు చేయించినట్లు ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈసమావేశంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………..
