* మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్…
* సిద్ధమైన తొలి దశ డీపీఆర్.. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన!
* రూ. 7,000 కోట్లతో మూసీ ప్రక్షాళన.. 1,435 నిర్మాణాలపై ప్రభావం.. పరిహారంపై సర్కార్ క్లారిటీ
* బఫర్ జోన్ నిర్ణయం గత ప్రభుత్వానిదే.. విమర్శలను తిప్పికొట్టిన మంత్రి శ్రీధర్ బాబు!
* మూసీ బాధితులకు 2013 చట్టం ప్రకారం న్యాయం.. త్వరలోనే ఏడీబీ నిధులతో పనులు ప్రారంభం
ఆకేరు న్యూస్, హైద్రాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధమైందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు 6,500 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పునర్నిర్మాణ పనుల వల్ల ప్రాథమికంగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, వీటన్నింటికీ సంబంధించి తుది సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మంత్రి వివరించారు. బాధితులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
బఫర్ జోన్ అంశంపై వస్తున్న విమర్శలకు మంత్రి గట్టిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న బఫర్ జోన్ నిబంధనలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నవేనని, తాము కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. డీపీఆర్ తయారీలో జాప్యం జరిగిందన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. 2024 డిసెంబర్లో ఒక సంస్థకు బాధ్యతలు అప్పగిస్తే, అన్ని అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే 2026 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారని ఆయన గుర్తు చేశారు. కేవలం రెండు నెలల్లోనే నివేదిక ఇచ్చారన్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు.
ప్రాజెక్టుల నిలిపివేతపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులను ఆపలేదని, గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను తామే పూర్తి చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఎస్టీపీల (STP) నిర్మాణంలో గత ప్రభుత్వం కేవలం 30 శాతం పనులే చేసిందని, మిగిలిన 70 శాతం పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని గణాంకాలతో సహా వివరించారు. త్వరలోనే ఏడీబీ (ADB) బోర్డు సమావేశంలో మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మరియు అనుమతులు లభించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
