* ప్రతి పేదోడి సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
* అభివృధ్ది సంక్షేమంలో వెనుకడుగు వేయలేదు
* మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
* మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ప్రతి పేదవానికి మేలు జరగాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార, జౌళి, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ కూడలిలో 6 కోట్లతో చేపట్టనున్న కూడళ్ళు అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం భారత్ ఫంక్షన్ హాలులో మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ, వడ్డీలేని రుణాలు, చేనేత రుణాలు మాఫీ ఉత్తర్వులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల పాటు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంపిణీ చేశామని, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణేనని, రూ.13 వేల కోట్లతో ఈ పథకం అమలవుతోందన్నారు. రైతులకు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ ఇప్పటివరకు రూ.3,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని నిక్కచ్చిగా చెల్లిస్తున్నారని అభినందించారు. పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య మాట్లాడుతూ గోదాములకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని, రైతులు పండించిన ధాన్యాన్ని భద్ర పరిచేందుకు ప్రభుత్వం గోదాములు మంజూరు చేసిందన్నారు. భూపాలపల్లి అభివృద్ధికి రోడ్లు, రైల్వే, ఆలయాలు, విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. చిరు వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.6 కోట్లతో శంకుస్థాపన చేశామని, భూపాలపల్లి బైపాస్ రోడ్డుకు రూ.500 కోట్లు, భూపాలపల్లి నుండి గుడెప్పాడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు రూ.664 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. విద్యాభివృద్ధి కోసం రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, రాష్ట్ర వేs కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, చిట్యాల.మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీదేవి, ఆర్డీవో హరికృష్ణ, డీఆర్?డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………………….
