*హరీష్ రావువి సత్యదూరమైన ఆరోపణలు – తుమ్మల కౌంటర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాజకీయ అస్తిత్వం కోసం రైతులను పావులుగా వాడుకుంటూ, బిఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హరీష్ రావు వ్యాఖ్యలను “సత్యదూరం” గా అభివర్ణించిన మంత్రి, అసలు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించారు
*రూ. 400 కోట్ల నుంచి రూ. 3087 కోట్లకు.. డీపీఆర్ మార్చింది మేమే!
గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోహెడ మార్కెట్‌ను కేవలం రూ. 399.96 కోట్ల అంచనాతో మొక్కుబడిగా డిజైన్ చేసిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రూ. 3087 కోట్ల భారీ అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోందని తుమ్మల వెల్లడించారు. పదేళ్ల కాలంలో ఒక్క అడుగు ముందుకు వేయని వారు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంటే అడ్డంకులు సృష్టించడం హాస్యాస్పదమని విమర్శించారు.
*భూముల కేటాయింపుపై క్లారిటీ: అమ్మే ప్రసక్తే లేదు!
”కోహెడ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే:
ఇప్పటికే ఉన్న 178.09 ఎకరాలకు తోడు, అదనంగా 239 ఎకరాలను మార్కెటింగ్ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఐఐసీకి కేటాయించిన భూమిలో పండ్ల ఎగుమతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ధరలు లభిస్తాయి. ఒకటి గడ్డిఅన్నారం మార్కెట్ తరహాలో హోల్‌సేల్ వ్యాపారం కోసం, మరొకటి గ్లోబల్ ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగాలుగా ఈ మార్కెట్ పనిచేస్తుంది.
*పదేళ్లు ఏం చేశారు? – హరీష్ రావుకు సూటి ప్రశ్న..
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే, పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని తుమ్మల ప్రశ్నించారు. “చెడు ఆరోపణలు మానుకోండి.. రైతులకు మేలు చేసే ఆలోచనలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి రండి, స్వాగతిస్తాం. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు” అని హితవు పలికారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా త్వరలోనే కోహెడలో దేశానికే తలమానికంగా ఉండే పండ్ల మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
———————————–
