
* డైట్ కాంట్రాక్ట్ రద్దుకు సిఫారసు
* ఆస్పత్రిని సందర్శించిన దామోదర రాజనర్సింహ
* ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆరా
* ఉస్మానియా ఆస్పత్రిలోని రోగుల పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిని మంత్రి దామోదర రాజనర్సింహ (DAMODARA RAJANARASIMHA) సందర్శించారు. 70 రోగులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైట్ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని వెల్లడించారు. దీనిపై విచారణకు ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మెయింటెనెన్స్ సరిగా లేదని ఫిర్యాదులు ఉన్నాయని దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఇప్పటికే రోగులకు అందించే డైట్, ఆస్పత్రుల నిర్వహణ తదితర అంశాలపై టాస్క్ ఫోర్స్ (TASKFORCE) ఏర్పాటు చేశామన్నారు. ఆ టాస్క్ ఫోర్స్ ప్రతి నెలా నివేదిక అందిస్తోందన్నారు. వాటి ఆధారంగా ఏ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలో ఆలోచిస్తామన్నారు.
విస్తరిస్తున్న కొవిడ్ (COVID) నేపథ్యంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా అవగాహన కలిగిస్తున్నామని దామోదర వెల్లడించారు. కొవిడ్ అనే కాకుండా సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసే ప్రజలకు కావాల్సిన చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తర్వాత అక్కడి నుంచి ఆయన ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కాగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో కలుషిత ఆహారం కారణంగా మంగళవారం 70 మంది అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కొందరు అతిసారతో బాధపడ్డారు. 18 మందిని ఉస్మానియా ఆస్పత్రి(OSMANIA HOSPITAL)కి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై డీఎంఈ, డీఎంహెచ్ వో, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
……………………………………………………..