ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో జరిగిన పెద్దమ్మ తల్లి గుడి ద్వితీయ వార్షికోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదలు ఇప్పగూడెం గ్రామ ప్రజలందరిపై నిండుగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంచి మనసుతో పెద్దమ్మ తల్లిని కొలిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ముదిరాజ్ కులస్తులకు ఆలయ సమీపంలోనే కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నెల రోజులలో 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అక్కపెల్లిగూడెం క్రాస్ నుండి సత్రంకుంట వరకు వర్షాకాలంలోపు సిసి రోడ్డు నిర్మాణం చేస్తానని అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి మొదటి విడతలో 53 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశానని రెండవ విడతలో మరో 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఇప్పగూడెం గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకునేందుకు గ్రామస్తులందరి సహకారం ఉండలాని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మందపురం రాణి అనిల్, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ కులస్తులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
