* అవసరం మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెయిడ్, ఓడి ఎస్ఎంఎస్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న మక్కలను, వాటి తేమ శాతాన్ని పరిశీలించి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మక్కలకు నిర్ణయించిన మద్దతు ధర 2400 ఉండగా మధ్య దళారులు మక్కలను 1600 నుండి 1700 కే కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మద్దతు లభించక పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పులపాలు అవుతున్నారని ఆవేదన చెందారు. మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేస్తారని, కొనుగోలు చేసిన వారం రోజులలోనే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయాని వెల్లడించారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు వ్యవసాయ శాఖ అధికారులతో నమోదు చేయించుకోవాలని తెలిపారు. త్వరలోనే అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
వ్యవసాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తీసుకువచ్చేందుకు అనేక సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 21 వేల కోట్లతో రుణ మాఫీ, 18 వేల కోట్లతో రైతు భరోసా, 3 వేల 500 కోట్లతో సన్నాలకు బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు 14 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రైతులు వరి మాత్రమే కాకుండా ఇతర పంటలు కూడా వేయాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో 3 సంవత్సరాలకు సరిపడా ధాన్యం నిలువలు ఉన్నాయని అన్నారు. కాబట్టి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదని అన్నారు. కాబట్టి రైతులు వరి కాకుండా ఇతర పంటలు వెళ్తేనే లాభాదాయకంగా ఉంటుందని సూచించారు. అలాగే పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్ల పెంపకంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి దేవాదుల కాలువలను బాగు చేయించి నియోజకవర్గంలోని 80 శాతం గ్రామాలకు సాగు నీరు అందించినట్లు వెల్లడించారు. గ్రామాలలో చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహకారంతోనే సాగు నీటి పనులు చేస్తున్నాని అన్నారు. రానున్న రోజులలో నియోజకవర్గంలో 100 శాతం గ్రామాలకు సాగు నీరు అందించి ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. అదే నా ప్రాధాన్యత, ప్రణాళిక అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నిజాయితీగా పని చేసినప్పుడే ప్రజలలో ఆదరణ ఉంటుందనే విషయాన్నీ ప్రజా ప్రతినిధులు గుర్తించాలని సూచించారు. జఫర్ గడ్ లో మార్కెట్ సబ్ యార్డు పని చేసే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. అలాగే మండల కేంద్రాలలో కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగు నీరు, మక్కలు అరబెట్టుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మార్క్ఫెడ్ డి ఎం రంజిత్ రెడ్డి, తాసిల్దార్ స్వప్న మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్క్ ఫెడ్, మార్కెట్, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
