* రాజకీయాలు వద్దు ఇది ప్రజల జీవిత సమస్య
* రేపు జరగబోయే బంద్ ని విజయవంతం చేయండి
* హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డా అని మరవద్దు
* డంపింగ్ యార్డ్ తరలించాలని డిమాండ్.
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కౌశిక్ రెడ్డి బతికున్నంత వరకు డంపింగ్ యార్డ్ రానివ్వను అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సిరిసపల్లి – రామంతపూర్ గ్రామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం ఉదయం ఆయన పరిశీలించి, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్, హనుమకొండ, వరంగల్ నగరాల చెత్తను తెచ్చి హుజూరాబాద్‌పై పారబోస్తామంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య అని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా దండం పెట్టి మరి హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెట్టవద్దని అసెంబ్లీలో డిమాండ్ చేశానని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, నేల కలుషితమై వ్యవసాయం కుంటుపడుతుందని, తాగునీరు విషతుల్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా మీద కోపం ఉంటే నన్ను జైల్లో పెట్టండి.. కానీ హుజూరాబాద్ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 జూలైలో సీఎం కరీంనగర్ కలెక్టరేట్‌కు డంపింగ్ యార్డ్ సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వుల కాపీని మీడియాకు చూపిస్తూ, ఈ విషయంలో రాజకీయాలు వద్దని, ప్రజలు డంపింగ్ యార్డ్ వద్దంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డా అని ముఖ్యమంత్రి మర్చిపోవద్దని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కమలాపూర్, హుజూరాబాద్ ప్రజల పోరాట పటిమను గుర్తు చేశారు.
ఈ పోరాటంలో భాగంగా ఏప్రిల్ 3న (రేపు) నిర్వహించబోయే నియోజకవర్గ బంద్ ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 4న తనకు సీఐడీ నోటీసులు అందిన నేపథ్యంలో, చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నానని, అయితే ఈలోగా ప్రభుత్వం డంపింగ్ యార్డ్‌ను తరలిస్తున్నట్లు ప్రకటన చేయకపోతే ఏప్రిల్ 7, 8 తేదీల్లో జేఏసీ ఆధ్వర్యంలో స్వయంగా తానే దీక్షకు దిగుతానని ప్రకటించారు. ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఏ కాంట్రాక్టర్ కూడా ఇందులో పాల్గొనవద్దని, ఒకవేళ పోలీసులను అడ్డం పెట్టుకుని పనులు మొదలుపెడితే ప్రజలందరం కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసు సోదరులు కూడా ప్రజల పక్షాన నిలబడి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.
