* దుబ్బాకపై సాగునీటి వివక్ష…
* రెండేళ్లయినా ఉప కాలువలపై ఉలుకు లేదు – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ఆకేరు న్యూస్ , గజ్వేల్:దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నీరు అందుబాటులో ఉన్నా రైతుల పొలాలకు మళ్లించలేని అసమర్థ స్థితిలో ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం గజ్వేల్లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పరిధిలోని సాగునీటి సమస్యలపై ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కృషితో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించుకుని ప్రధాన కాలువలను పూర్తి చేశామని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉప కాలువల (Distributary Canals) నిర్మాణంపై కనీసం స్పందించడం లేదని విమర్శించారు. కరువు పీడిత ప్రాంతమైన దుబ్బాకకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇర్కోడు ఎత్తిపోతల పథకానికి నిధులు ఉన్నప్పటికీ పంప్ హౌస్ పనులు పూర్తి చేయకపోవడంపై మెగా కాంట్రాక్టర్ల తీరును ఎమ్మెల్యే తప్పుపట్టారు. ప్రధాన కాలువలలో పూడిక తీయకపోవడాన్ని గమనించిన ఆయన, వెంటనే పూడిక తొలగించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. పాత రేట్లకు భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పరిహారం చెల్లించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం సహకరించకపోవడంతో రైతులు స్వయంగా ప్రోక్లెయిన్లతో కాలువలు తవ్వుకుంటున్నా, కాంట్రాక్టు సంస్థలు వారికి కనీస సాంకేతిక సహకారం అందించకపోవడం శోచనీయమని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని 10, 11, 12, 13 ప్యాకేజీల ద్వారా రామాయంపేట, శంకరంపేట, ఉప్పర్పల్లి మరియు దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం ఉందని ఎమ్మెల్యే వివరించారు. “ఉప కాలువలు పూర్తయితేనే నియోజకవర్గంలోని 1.20 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరు అందుతుంది. నీళ్లు పక్కనే ఉన్నా కాలువలు లేక రైతులు అల్లాడుతున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని, తక్షణమే ఉప కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి వ్యవస్థపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో గజ్వేల్, సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ఈలు సుధా కిరణ్, లక్ష్మణ్, ఈఈలు, డీఈలు, ఏఈఈలు, వివిధ మండలాల తహసీల్దార్లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
