* క్రీడాకారులు, నిరుద్యోగులు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై నిలదీత
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
అసెంబ్లీ వేదికగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడాకారుల ఇచ్చే ప్రోత్సాహకాలు, నిరుద్యోగ భృతి, గొల్ల-కురుమల సంక్షేమం, పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై ఆయన తనదైన శైలిలో గళం వినిపించారు.
క్రీడాకారులకు సమాన గౌరవం దక్కాలి
ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో తెలంగాణ బిడ్డలు ఉండటం గర్వకారణమని పేర్కొన్న ఆయన, క్రీడాకారుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. మహమ్మద్ సిరాజ్‌కు ఇచ్చినట్లే తిలక్ వర్మకు కూడా కోటి రూపాయల నగదు, 500 గజాల స్థలం మరియు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు కోటి రూపాయలు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాకు 500 గజాల స్థలం కేటాయించాలని కోరారు. అండర్-19 ప్లేయర్ ధృతికి కేవలం 10 లక్షలు ఇవ్వడం సరికాదని, ఆమెకు కూడా కోటి రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేపట్టాలి
హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు పంచాలని కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హుజూరాబాద్ పట్టణంలో 500, కమలాపూర్‌లో 350, జమ్మికుంటలో 200 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. జమ్మికుంటలో 70% పనులు పూర్తయిన మరో 300 ఇళ్లకు నిధులు విడుదల చేసి, వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు.
ఉద్యోగాల భర్తీపై సవాల్
గత కేసీఆర్ ప్రభుత్వం 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని, కేవలం 10 వేల ఉద్యోగాలతో సరిపెట్టిందని విమర్శించారు.
కుమ్మరి, గొల్ల-కురుమ, మత్స్యకారుల సంక్షేమం
కేసీఆర్ హయాంలో గొర్రెల పంపిణీ ద్వారా తెలంగాణ షీప్ ప్రొడక్షన్లో నంబర్ వన్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఫిషరీస్ రంగానికి గతంలో 100 కోట్లు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 20 కోట్లే కేటాయించడం బాధాకరమన్నారు. ఈ బడ్జెట్లో కనీసం 200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వినిపించడంతో ఇప్పటికైనా నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
