ఆకేరు న్యూస్, హుజూురాబాద్ : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పై మత మార్పిడి చేస్తున్నట్టు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వెంటనే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ కార్యదర్శికి రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత జనవరి 30న తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ గౌష్ ఆలం పై మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ చేసిన నిరాధారమైన వార్తల వల్ల తాను కలత చెందినట్లు, నిజాయితీతో, నిబద్ధతతో కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఇచ్చిన ప్రకటన పట్ల వెంటనే ఐఏఎస్ అసోసియేషన్ క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి లేఖ లో పేర్కొన్నారు. లేఖ అందిన 3 రోజుల్లోపు ఆరోపించిన మాటలను చెబుతున్నట్లున్న వీడియోను చూపించాలని లేదా ప్రింట్ మీడియాలో లిఖితపూర్వక క్షమాపణను ప్రచురించాలని నేను మిమ్మల్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే మీపై మరియు తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మొత్తం ఆఫీస్ బేరర్లపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించవలసి ఉంటుంది. దాని వల్ల కలిగే అన్ని ఖర్చులు, పరిణామాలకు మీ అందరినీ బాధ్యులుగా చేస్తాను అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.కాగా వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరలో పాడి కౌశిక్ రెడ్డి, కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై ఈరోజు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసి సంబంధిత పోలీస్ అధికారులు హుజురాబాద్ ACP మాదవి, జమ్మికుంట రూరల్ CI లక్ష్మినారాయణ, కరీంనగర్ CP గౌస్ ఆలం పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.
