
* చెప్పినట్లుగానే విప్ జారీ చేసిన బీఆర్ ఎస్
* ఓటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో ఓవైపు ఎండ ఠారెత్తిస్తుంటే, మరోవైపు నిశ్శబ్దంగా ఎమ్మెల్సీ ఎన్నిక (Mls Election) కొనసాగుతోంది. ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి (Ghmc) ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ (Ms Prabhakar) పదవీకాలం ముగియడంతో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ తరపున గౌతం రావు బరిలోకి దిగగా.. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి పోటీలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొత్తం 112 మంది ఉన్నారు. వీరంతా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. చెప్పినట్లుగానే ఓటింగ్ లో పాల్గొనవద్దంటూ తమ పార్టీ కార్పొరేటర్లకు బీఆర్ ఎస్ విప్ జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఓటింగ్ లో పాల్గొన్నాయి. ప్రస్తుతం బలాబలాలను పరిశీలిస్తే.. ఎంఐఎం బలం 49.. బీజేపీ బలం 25 ఓట్లు ఉండగా బీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 14 ఓట్ల బలం కలిగి ఉంది. ఎక్కువ ఓటర్లున్న ఎంఐఎం పార్టీ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటుందని మొదట్లో అంతా భావించారు. అనూహ్యంగా బీజేపీ పోటీలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది.
…………………………………………………………………