
* నా టైం ఇక్కడితో అయిపోయింది
* ప్రాణం తీసుకున్న బ్యాంకు ఉద్యోగి రవికుమార్ సూసైడ్ నోట్
ఆకేరు న్యూస్, అమరావతి : ‘అమ్మా.. ఇక సెలవ్. హరితా నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి లాభం లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసుకున్న అప్పులే నా పాలిట శాపం అయ్యాయి. నా టైం ఇక్కడితో అయిపోయింది. రూ.50 వేలు అప్పు తీసుకుంటే… రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చారు. ప్రతినెలా రూ.15,000 ఇచ్చాను. వడ్డీ కడుతూ ఇప్పటి వరకూ రూ. 1.20 లక్షలు కట్టాను. ఇంక నా వల్ల కాదు.’ ప్రాణం తీసుకున్న బ్యాంకు ఉద్యోగి రవికుమార్ రాసుకున్న ఆఖరి మాటలు.
అనంతపురం గుత్తి రోడ్డు (Gutti Road)లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ఉద్యోగి రవికుమార్ (Ravikumar) (40) అప్పుల బాధలు భరించలేక బుధవారం బ్యాంకులోనే ఉరేసుకుని, ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలులోని సీ క్యాంపు ప్రాంతానికి చెందిన సంకుల రవికుమార్ కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి వినాయకనగర్‌లో స్థిరపడ్డాడు. భార్య హరిత, పిల్లలు 13 ఏళ్ల సూర్యతేజ, 11 ఏళ్ల దీక్షిత, 10 ఏళ్ల వీక్షిత ఉన్నారు. 12 ఏళ్లుగా బ్యాంకులో సబ్ స్టాఫ్ (దస్తరీ)గా పనిచేస్తుండేవాడు. బుధవారం ఉదయం 9.45 గంటలపుడు బ్యాంకుకు వెళ్లి అక్కడి ఉద్యోగులతో కాసేపు మాట్లాడాడు. భార్యకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పాడు. 9.50 గంటలకు బ్యాంకులోని వాష్‌రూంకు వెళ్లి తెచ్చుకున్న నైలాన్ తాడును కిటికికీ కట్టి ఉరి వేసుకున్నాడు. ఎంతకు వాష్‌రూమ్ తలుపులు తీయకపోవడంతో గుర్తించిన బ్యాంకు సిబ్బంది, ఇంటికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్, అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో కార్పెంటర్ ఓపెన్ చేసి చూడ గా… ఉరివేసుకుని, మరణించాడు. రవికుమార్ మృతదేహాన్ని వాష్‌రూమ్ నుంచీ బయటకు తీయగానే… భార్య హరిత, ఇతర కుటుంబీలు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ శాంతిలాల్, వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య హరిత ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
………………………………………..