* స్తంభించిన జన జీవనం
* పలు రైళ్లను నిలిపివేసిన అధికారులు
* కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
* పంట చేతికందే సమయంలో తీవ్ర నష్టం
ఆకేరు న్యూస్, డెస్క్ : వాన దంచికొడుతోంది. రాష్ట్రంలో మొంథా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, వరంగల్‌తో సహా పలు జిల్లాలో వర్షం పడుతోంది. తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖా ముందే హెచ్చరించింది. వరంగల్ రైల్వేస్టేషన్లో పలు రైళ్లను నిలిపివేసింది. డోర్నకల్ రైల్వేస్టేషన్లో రైలుపట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు అక్కడే నిలిపివేశారు. కాజీపేట నుంచి విజయవాడ మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. వరద నీరు రహదారులపై చేరడంతో జనజీవనం స్తంభించింది. ములుగులో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లోని ఎల్ ఎండీ నుంచి నీటిని విడుదల చేశారు. డ్యాంలోకి వరద నీరు చేరుతుండడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పతి నిలిచిపోయింది. మంత్రులు పొంగులేటి, సీతక్క అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను వాకబ్ చేస్తున్నారు.
……………………………………….
