* మూత్రం వస్తుందని చెప్పి మాయం
* ప్రిజం పబ్బు ఫైరింగ్ కేసులో నిందితుడు
* ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
* ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం
* రంగంలోకి ప్రత్యేక బలగాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫ్రిజమ్ పబ్బులో నిందితుడైన బత్తుల ప్రభాకర్ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కోర్టు నుంచి రాజమండ్రి తీసుకెళ్తుండగా దారిలో మాయమయ్యాడు. మూత్రం వస్తుందని చెప్పడంతో కానిస్టేబుల్ సంకెళ్లు తీయగా ఆ వెంటనే పరారయ్యాడు. కారాగారానికి మరో పది నిమిషాల్లో చేరుకుంటాం అనగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం తాజాగా రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. బత్తుల ప్రభాకర్ (Bathula Prabhakar) వయసు సుమారు 35 సంవత్సరాలు. ప్రభాకర్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకుని వెళ్లి, మరలా తిరిగి రాజమహేంద్రవరం తీసుకువచ్చే క్రమంలో నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసు వారి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు ప్రకటించారు. తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్ (Hand cups) ఉన్నాయని, ఆయన వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. ప్రభాకర్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఇన్స్పెక్టర్ దేవరపల్లి- 9440796584, సబ్ ఇన్స్పెక్టర్ దేవరపల్లి- 9440796624 నంబర్లకు తెలియజేయాని, ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు అతడి కోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి.
………………………………………………………..
