Kavya Srihari Anganwadi smartphones
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో అంగన్వాడీలదే కీలకపాత్రని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి లు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ‘ఎస్ కన్వెన్షన్’ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణి కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
* డాక్టర్ కడియం కావ్య
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వ్యవస్థను ఆధునికీకరించే దిశగా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. అంగన్వాడి టీచర్లపై ఉన్న పేపర్ వర్క్ భారాన్ని తగ్గిస్తూ, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఇంటర్నెట్, డిజిటల్ సదుపాయాల వినియోగంలో మహిళలు వెనుకబడి ఉన్నారని పలు సర్వేల్లో వెల్లడైందని గుర్తు చేశారు. ఈ డిజిటల్ జెండర్ గ్యాప్‌ను అధిగమించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడి సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందించడం ద్వారా కీలక అడుగు వేసిందని అన్నారు.
తల్లి–శిశు సంక్షేమంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్యలో అంగన్వాడి టీచర్లు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పిల్లల మానసిక స్థితిని గుర్తించడం, వారి అభివృద్ధిని పర్యవేక్షించడం కూడా అంగన్వాడి సిబ్బంది బాధ్యతలో భాగమని తెలిపారు. ఆటిజం వంటి సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వారికి సరైన వైద్యం అందించవచ్చని, ఇందులో అంగన్వాడి టీచర్ల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. చిన్నపిల్లలపై జరిగే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌ను నివారించేందుకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అవసరమని సూచించారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొంటూ, ప్రతి మహిళ ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఎంపీ అన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో అంగన్వాడి సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారతాయని, లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామని తెలిపారు. భవిష్యత్తులో అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికహారం అందించడంతో పాటు ఆరోగ్యావంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమైనదని తెలిపారు. అత్యధిక పోషక విలువలు ఉన్న బాలామృతం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలోనే ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియం బోధన అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలకు అనుబందంగానే ప్రీ స్కూల్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చాలా అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో 349 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, అందులో జనగామ జిల్లా పరిధిలో 245 కేంద్రాలు, హన్మకొండ జిల్లా పరిధిలో 104 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఏ విధమైన సదుపాయాలు లేకుండా అద్దె భవనాలలో 108 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. హన్మకొండ, జనగామ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడైతే అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం గాని, ప్రభుత్వ పాఠశాలలో అనువైన ప్రదేశం గాని ఉంటే వేంటేనే అక్కడ ఉపాధి హామీ నిధుల ద్వారా అంగన్వాడీ భవన నిర్మాణాన్ని మంజూరు చెసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఎలాంటి మౌలిక సదుపాయాలు 108 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలను నెల రోజుల్లో మంజూరు చేయించి సంవత్సరం లోపు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. 100 శాతం అంగన్వాడీ లకు స్వంత భవనాలు నిర్మించి తెలంగాణకు మాడల్ గా నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చాలా కష్టపడుతున్నారని పోటీపడి బాగా చదివించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అలాగే మనం కూడా పోటీ పడి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలని వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధన పద్ధతులు పాటించాలని, ఇందుకోసం ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్లు నీల రాజమ్మ, నూకల ఐలయ్య హన్మకొండ, జనగామ డిడబ్ల్యుఓలు విశ్వజ, కోదండరాం, తహసీల్దార్ స్వప్న, ఎంపీడివో జయశ్రీ, మున్సిపల్ కౌన్సిలర్లు సంగీత, లక్ష్మి, రజిత, సంపత్ రాజ్ అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
