*రైతన్నపై ఇంధన భారం..
*డీజిల్ ధరలతో కుదేలవుతున్న సాగు
* రైతులకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలని కడియం కావ్య డిమాండ్
*పెట్రో ధరల సెగ: కేంద్ర ప్రభుత్వంపై వరంగల్ ఎంపీ ప్రశ్నల వర్షం
ఆకేరు న్యూస్, డెస్క్:దేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడితో పాటు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్సభలో జరిగిన చర్చా సందర్భంగా ఆమె రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
*పెరుగుతున్న సాగు ఖర్చులు – తగ్గుతున్న ఆదాయం
ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ ఆధారిత ధరల విధానం వల్ల రైతులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని డాక్టర్ కావ్య పేర్కొన్నారు. వ్యవసాయంలో యంత్రాల వినియోగం, ఎరువుల రవాణా, పండించిన పంటను మార్కెట్కు తరలించడం వంటి పనులన్నీ ఇంధన ధరలతో ముడిపడి ఉన్నాయని.. డీజిల్ ధరల పెరుగుదల వల్ల సాగు వ్యయం పెరిగి రైతుకు నికర ఆదాయం మిగలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
*కేంద్ర మంత్రి సమాధానం:
కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సమాధానమిస్తూ.. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా చమురు సంస్థలే ధరలను నిర్ణయిస్తాయని తెలిపారు. గతంలో ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా కేంద్రం కొంత ఉపశమనం కల్పించిందని వివరించారు.
*రైతులకు ప్రత్యేక రాయితీ కావాలి:
కేంద్రం తీసుకుంటున్న చర్యలు సాధారణ వినియోగదారులకు కొంత మేర ఉపయోగపడవచ్చు కానీ, రైతులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష సబ్సిడీలు లేదా డీజిల్ రాయితీలు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే కార్యాచరణ చేపట్టాలని కోరారు.
