ఆకేరు న్యూస్, డెస్క్:పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య రైతుల పక్షాన నిలిచారు. వరంగల్ జిల్లాలో ఎరువుల సరఫరా, లభ్యత మరియు సబ్సిడీ అమలుపై ఆమె లోక్సభలో కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. సాగు సీజన్ ప్రారంభంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర స్థాయి వరకు ఎరువుల సరఫరాను కేంద్రం పర్యవేక్షిస్తుందని, అయితే జిల్లా స్థాయిలో రైతులకు పంపిణీ చేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.గడిచిన మూడేళ్లలో వరంగల్ జిల్లాలో యూరియా, డీఏపీ (DAP), ఎంఓపీ (MOP), ఎన్పీకే (NPK) ఎరువుల లభ్యత సంతృప్తికరంగా ఉందని కేంద్రం తన నివేదికలో పేర్కొంది.ఆధార్ ఆధారిత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా పారదర్శకంగా ఎరువులు విక్రయిస్తున్నామని, రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా ధరల వివరాలు తెలుపుతున్నామని వివరించారు.కాగితాల మీద లెక్కలు కాదు.. గ్రౌండ్ రియాలిటీ ముఖ్యం అని కడియం కావ్య అన్నారుకేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై డా. కడియం కావ్య స్పందిస్తూ.. కేవలం కాగితాల మీద లెక్కలు చూపిస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైనప్పుడు ఎరువులు అందడమే ముఖ్యమని పేర్కొన్నారు. “కేంద్రం చెబుతున్న లెక్కలకు, గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పొంతన లేదు. ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి రాకూడదు. వరంగల్ జిల్లా రైతులకు ఎరువుల కొరత రాకుండా, వారికి న్యాయం జరిగే వరకు పార్లమెంట్లో పోరాడుతూనే ఉంటాను.”రాబోయే సాగు సీజన్లలో వరంగల్ రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
