* డెలివరీ చేసిన సిబ్బంది.. తల్లీ బిడ్డ సేఫ్!
ఆకేరు న్యూస్,ములుగు:ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో, అంబులెన్స్ సిబ్బంది చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. డెలివరీ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగిన గర్భిణికి డాక్టర్లు వైద్యం నిరాకరించడంతో, అంబులెన్స్‌లోనే పురుడు పోసి తల్లీ బిడ్డలను కాపాడారు.
అసలేం జరిగిందంటే:
ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురానికి చెందిన మాడెం సమ్మక్కకు గురువారం ఉదయం ప్రసవ వేదన మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఈఎంటి శివలింగప్రసాద్, పైలట్ యాకూబ్ పాషా ఆమెను మొదట వాజేడు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమికంగా పరీక్షించి ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు.
తీరా అక్కడికి వెళ్తే, సమ్మక్కకు రక్తహీనత (6 శాతం హిమోగ్లోబిన్ మాత్రమే) ఉందని, పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ ములుగు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. చేసేదేం లేక ములుగుకు బయలుదేరిన క్రమంలో గోవిందరావుపేట సమీపంలో సమ్మక్కకు నొప్పులు తీవ్రమయ్యాయి.
సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడారు:
పరిస్థితిని గమనించిన ఈఎంటి శివలింగప్రసాద్, రోడ్డు పక్కనే అంబులెన్స్ ఆపి, సమయస్ఫూర్తితో ప్రసవం చేశారు. సమ్మక్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ బిడ్డలను సురక్షితంగా ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యులకు అప్పగించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. వైద్యులు నిరాకరించిన సమయంలో దైవంలా ఆదుకున్న అంబులెన్స్ సిబ్బందిని సమ్మక్క కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
