EVM Security
ఆకేరు,న్యూస్ ములుగు : ఈవీఎంల భద్రత లో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ నెలవారీ తనిఖీ నిర్వహించారు.
గోదాం సీల్‌ను, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గోదాం వద్ద పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రతి నెలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా 24 గంటల పాటు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నామని, గోదాంలోని భద్రతా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. భద్రతా విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయభాస్కర్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

